English | Telugu

గోదావరిలో ముగిసిన బోటు ఆపరేషన్‌.... స్పాట్ నుంచి వెళ్లిపోయిన ధర్మాడి బృందం

గోదావరిలో ఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. రెండో ప్రయత్నంలో ధర్మాడి బృందం విజయం సాధించింది. రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా... పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ధర్మాడి సత్యం బృందం చివరికి విజయం సాధించింది. గోదావరి శాంతించడంతో అక్టోబర్ పదహారు నుంచి రెండోసారి తీవ్రంగా ప్రయత్నించిన ధర్మాడి టీమ్‌.... బోటును బయటికి తీయడంలో సక్సెస్ అయ్యింది. ధర్మాడి సూచన మేరకు స్కూబా డైవర్లు నదీ గర్భంలోకి దిగి ఐరన్ రోప్‌ను బోటు ఫ్యాన్‌కు కట్టడంతో నది ఒడ్డున ఏర్పాటుచేసిన పొక్లెయిన్‌తో బయటికి లాగారు. ముందుగా నదీగర‌్భం నుంచి నీటి పైభాగానికి బోటును తెచ్చిన ధర్మాడి బృందం... ఆ తర్వాత రోప్‌ల సాయంతో ఒడ్డుకి లాక్కొచ్చారు.

అయితే, ప్రమాదం జరిగిన 38రోజుల తర్వాత బయటికి తీయడంతో బోటు పూర్తిగా ధ్వంసమైంది. ఇక, బోటులో నుంచి ఎనిమిది మృతదేహాలను బయటికి తీయగా, మరికొన్ని డెడ్‌బాడీస్‌ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, బోటు 38రోజులపాటు నదీగర్భంలో ఉండటంతో మృతదేహాలు ఉబ్బిపోయి గుర్తుపట్టలేనివిధంగా మారాయి. ఇక, బోటు బయటకు తీయడంలో తన బృందంతోపాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు ధర్మాడి సత్యం. ముఖ్యంగా విశాఖ నుంచి వచ్చిన స్కూబా డైవర్స్ తమకు ఎంతో సహకరించారని చెప్పారు. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ... మెరైన్‌, నేవీ బృందాలు కూడా చేయలేని పనిని ధర్మాడి సత్యం బృందం చేసిందని పలువురు అభినందిస్తున్నారు.