English | Telugu

కౌంటింగ్‌కి ముందే చేతులెత్తేసిన నేతలు.. ఎగ్జిట్ పల్స్ పై టీకాంగ్రెస్‌లో టెన్షన్...

ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మమని పైకి చెబుతున్నా... తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందట. హుజూర్ నగర్ బైపోరులో గెలుపు గులాబీ పార్టీదేనని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పడమే కాకుండా 25వేల వరకు మెజారిటీ వస్తుందని ప్రకటించడంపై ఉత్తమ్ సహా ముఖ్యనేతలంతా షాక్ అయ్యారట. ఎందుకంటే, హుజూర్ నగర్ ... ఒకవైపు కాంగ్రెస్ సిట్టింగ్ కావడం... మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోట అవడంతో... కచ్చితంగా మళ్లీ తామే గెలుస్తామన్న ధీమాతో టీకాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కలిసొచ్చి భారీ మెజారిటీ సైతం వస్తుందని లెక్కలేశారు. అంతేకాదు హుజూర్ నగర్ ను భారీ మెజారిటీతో మరోసారి చేజిక్కించుకుని, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కేసీఆర్ పాలనపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ జనంలోకి వెళ్లాలని కలలుగన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ ను దారుణంగా ఓడించి కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా నింపాలని భావించారు.

అయితే, కాంగ్రెస్ లీడర్ల ఆశలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ దే గెలుపు అని చెబుతుండటంతో ఉత్తమ్ తోపాటు టీపీసీసీ ముఖ్య నేతల్లో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ లో ఆందోళన మొదలైందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మమని పైకి చెబుతున్నా... ఎక్కడ సిట్టింగ్ సీటు చేజారిపోతుందోనని భయపడుతున్నారట. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమై టీఆర్ఎస్ గెలిస్తే... సొంత పార్టీలోనే విమర్శలు వస్తాయని ఉత్తమ్ వణికిపోతున్నారట. ఎందుకంటే, సొంత సీటునే కాపాడుకోలేనివాళ్లు... ఇక పార్టీని ఎలా కాపాడుతారంటూ విమర్శలు చెలరేగడం ఖాయం. అలాగే, టీకాంగ్రెస్ లో ఉత్తమ్ పరపతి కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ ఆలోచించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఉత్తమ్ భయపడుతున్నారట. అయితే, ఒకపక్క గుబులు ఉన్నప్పటికీ, కచ్చితంగా తన సతీమణి గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఉత్తమ్. మరి, ఎగ్జిట్ పల్స్ నిజమవుతాయో... లేక ఉత్తమ్ నమ్మకం గెలుస్తుందో చూడాలి.