English | Telugu
అప్పట్లో శేషన్ ..... ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ !
Updated : Apr 11, 2020
1990-96 మధ్య కాలంలో కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు టి.ఎన్. శేషన్. ఈయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. 1955 తమిళనాడు కేడర్‌కు చెందిన శేషన్... రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 1989లో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం... కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్‌గా శేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారధిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మకమైన చర్యలు... ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారులు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పకతప్పదు. ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టి.ఎన్. శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది... ఆయన కేంద్రఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘంచేందుకు సాహించలేకపోయారు.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శేషన్ పలు కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ అన్నది సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చెపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంతవరకు వినియోగించుకున్నారు.
ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలిచారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నిటికీ మించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహ స్వప్నమయ్యారు.ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఎంతో కొంత, శేషన్ స్థాయిలో తన విధులను నిర్వర్తించే క్రమంలో నికార్సైన రీతిలో నిలబడ్డారు. ఈ సంఘటనల నుంచి, ప్రజాస్వామ్య పిపాసులు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి.