English | Telugu
ఆరోగ్యశ్రీకి కొత్త కష్టాలు.. ఏపీ సర్కార్ దెబ్బకి జారుకుంటున్న ప్రముఖ ఆసుపత్రులు!!
Updated : Nov 25, 2019
ఆరోగ్యశ్రీ ట్రస్టు దెబ్బకు నెట్ వర్క్ ఆసుపత్రులు బెంబేలెత్తుతున్నాయి. భారీగా బకాయిలు, బిల్లుల కటింగులు, లక్షల రూపాయల పెనాల్టీతో ట్రస్టు అధికారులు వీటిని హడలెత్తిస్తున్నారు. దీంతో ప్రధాన నగరాల్లోని ప్రముఖ ఆసుపత్రులు నెట్ వర్క్ నుంచి బయటికొచ్చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో రెండు, విజయవాడలో మూడు నెట్ వర్క్ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.
ఆసుపత్రులపై ట్రస్ట్ అధికారులు భారీగా పెనాల్టీలు వేస్తున్నారు. వంద రూపాయలు తప్పు జరిగిందని తేలిస్తే దానికి పది రెట్లు జరిమానా రూపంలో భారం మోపుతున్నారు. ఇటీవల విశాఖ లోని ఒక జాతీయ స్థాయి ఆసుపత్రికి 16 లక్షల పెనాల్టీ వేశారు. ఆ మొత్తం కట్టిన వెంటనే సదరు ఆస్పత్రి యాజమాన్యం నెట్ వర్క్ నుంచి తప్పుకుంది. అలాగే విజయవాడలో రెండు ఆసుపత్రులకు 15 లక్షల వరకు జరిమానాలు వేయటంతో అవి కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఒక ఆసుపత్రి తప్పు చేసిందని తెలిస్తే ముందుగా డిసిప్లీనరీ కమిటీకి పంపించేవారు. అక్కడ రుజువైతే సాధారణ పెనాల్టీతో సరిపెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని కేవలం ఆరోగ్యమిత్ర నిర్ధారించినా భారీగా పెనాల్టీలు వేస్తున్నారని ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. సమయానికి బిల్లులు ఇవ్వకపోగా భారీగా పెనాల్టీలు వేస్తూ ఉండటంతో ఆరోగ్యశ్రీ సేవలు అందించటం వృథా అన్న స్థితికి ఆసుపత్రులు చేరుకున్నాయి. ట్రస్ట్ ను పూర్తిగా బిజినెస్ మోడల్ లోకి మార్చే విధంగా అధికారులు సిద్ధం చేస్తున్న కొత్త ప్రతిపాదనలు కూడా నెట్ వర్క్ ఆసుపత్రులకు వణుకు పుట్టిస్తున్నాయి.
జిల్లాలో విధులు నిర్వహించే ఆరోగ్య మిత్రాలు, టీమ్ లీడర్లు, డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ లకు జీతాలు ట్రస్టు నుంచి చెల్లిస్తున్నారు. ఇకపై వారికిచ్చే జీతంలో సగం ట్రస్టు నుంచి సగం నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి చెల్లించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్య మిత్రాలు నెట్ వర్క్ ఆసుపత్రుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలు ఎక్కువగా ఆయా ఆసుపత్రులకు బిజినెస్ పెంచటానికే ఉపయోగిస్తున్నారు. కాబట్టి వారి జీతాలలో కొంత మొత్తం సదరు ఆసుపత్రులే ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఆస్పత్రులకు ఇచ్చే బిల్లుల్లో ఎడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కింద రెండు శాతం కట్ చేసి ఇవ్వాలని భావిస్తున్నారు. మరో నెలలో ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే తమ బిల్లులో ఇప్పటికే రెండు శాతం ట్రస్ట్ కట్ చేస్తున్నట్లు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి అనుగుణంగా ఏటా ఆరోగ్యశ్రీ అమలు చేసే ప్యాకేజీలను పెంచాల్సి ఉంటుంది. 2007-09 వరకు సీపీఐ 150 శాతం పెరిగినట్టు సమాచారం. కానీ ప్రభుత్వాలు 7.5 శాతం మాత్రమే పెంచాయి. 2007-14 వరకు సీపీఐ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఐదు శాతం పెరిగింది. గత ప్రభుత్వం ఒకేసారి 2.5 శాతం పెంచి 2017-18లో అమలు చేసింది. దానిని యథాతథంగా కొనసాగించాల్సిన కొత్త ప్రభుత్వం పెరిగిన ప్యాకేజీ చెల్లించటం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే 2018-19లో పెంచిన ప్యాకేజీ కూడా చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటున్నాయి.ఈ ఏడాది 2.5 శాతం ప్యాకేజీకి ప్రభుత్వం సున్నం కొట్టిందని. భవిష్యత్తులో కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రస్ట్ అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వం నిర్ణయాలతో నెట్ వర్క్ పై భారీగా భారం పడుతుంది. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలని ఆశా ప్రతినిధులు నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.