English | Telugu
దొరికినంత దోచుకుంటున్న ఏపీ నేతలు... వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్ బయట పడింది!
Updated : Nov 25, 2019
వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్ బయట పడింది. రైస్ మిల్లర్లు.. కొందరు లీడర్లు.. సివిల్ సప్లై అధికారులు.. కలిసి సర్కారు ఖజానాకు గండి కొట్టి.. ఏకంగా 1500 కోట్లు దోచుకున్నారు. గతేడాది ఖరీఫ్ లో ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే వడ్లను కొని తెచ్చి ఇక్కడ మద్దతు ధరకు సర్కారుకు విక్రయించారు. దీనికోసం ఇక్కడి చిన్న రైతులు ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల సహకారంతో వ్యవహారం నడిపించారు. ఇలా దోచుకున్న సొమ్ములో సివిల్ సప్లైలోని పెద్దాఫీసర్లు నుంచి మండల స్థాయి అధికారుల దాకా వాటాలు వెళ్లాయని, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రైస్ మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి ముందే కొని తెచ్చిన వడ్లను తమ గోదాంలో నిల్వ చేస్తారు. అర ఎకరం నుంచి 7,8 ఎకరాల భూమి ఉన్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. వారి ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటారు. ముందే ఐకేపీ సెంటర్ సివిల్ సప్లై అధికారులతో మాట్లాడుకుని ఏ ఐకేపీ సెంటర్ కు ఏ రైతు వివరాలు పంపాలో ప్లాన్ చేసుకుంటారు మిల్లర్లు. తాము ఒప్పందాలు చేసుకున్న రైతుల వివరాలను సదరు ఐకేపీ సెంటర్ కు పంపుతారు. ఆ ఐకేపీ సెంటర్ వాళ్లు అదే వివరాలను అప్ లోడ్ చేస్తారు. కొద్ది రోజుల్లో సర్కారు నుంచి రైతు ఖాతాలో సొమ్ము జమవుతుంది. మిల్లర్లు ఆ సొమ్ము తీసుకుని ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు ఎంతో కొంత డబ్బు ఇస్తారు.
గతేడాది ఐకేపీ కొనుగోళ్ల పై అనుమానం వచ్చి లెక్కలు చూస్తే ఈ స్కామ్ ఇంటర్నల్ గా బయటకొచ్చింది. రాష్ట్రంలో 2017-18 ఖరీఫ్ లో 10.47 లక్షల హెక్టార్ లలో వరి సాగు జరిగితే 18,24,802 టన్నుల ధాన్యం సేకరించారు. 2018-19 ఖరీఫ్ లో 11.89 లక్షల హెక్టార్ లలో వరి సాగైంది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో జరిగిన వడ్ల కొనుగోళ్లు రెండింతలు దాటిపోయాయి. ఏకంగా 40,41,429 టన్నుల ధాన్యం కొనుగోళ్ళు జరిగాయి. ఒక్కసారి ఇంతగా పెరిగి పోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆరా తీసే పనిలో పడింది సర్కార్. కొందరు మిల్లర్లు సివిల్ సప్లై శాఖ అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేశారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఖరీఫ్ లో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ మద్దతు ధరకు విక్రయించారన్న సమాచారంతో ఈ సారి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఇక ప్రతి రైతు తను పండించిన పంటను సొంత గ్రామంలో మాత్రమే విక్రయించాలనే నిబంధన పెట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు తెలుస్తోంది. వడ్ల కేసుపై ఇప్పటికే ప్రాథమిక విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయితే కథ మొత్తం బయటపడుతోందని అక్రమార్కుల పై వేటు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.