English | Telugu
పిల్లలమర్రికి పూర్వ వైభవం.. పాలమూరు బ్రాండ్ కు కొత్త కళ
Updated : Nov 25, 2019
ప్రకృతి రాజసం పిల్లలమర్రికి పునర్జన్మ నిచ్చింది. పాలమూరు జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన పిల్లలమర్రికి మళ్లీ ప్రాణం వచ్చింది. ఏడాది క్రితం వరకు ఎండిపోయిన ఆకులు విరిగిపడ్డ ఊడలతో కళావిహీనంగా కనిపించింది. 700 ఏళ్ళ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆ చెట్టు మళ్ళీ పునరుజ్జీవం పోసుకుంటుంది. ఏడాదిన్నర పాటు శ్రమించి అందించిన వైద్యంతో మహా మర్రి మళ్లీ నిలబడింది. ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఆ మహా వృక్షాన్ని సంరక్షించడంలో జిల్లా యంత్రాంగం కృషి ఫలించింది.
త్వరలోనే పిల్లలమర్రి మహా వృక్షాన్ని చూడ్డానికి సందర్శకులను అనుమతించనున్నారు. చెద పీడను వదిలించడానికి.. చచ్చిపోతున్న చెట్టును బతికించడానికి.. సెలైన్ బాటిళ్లతో ప్రాణం పోసే చర్యలకు శ్రీకారం చుట్టారు జిల్లాధికారులు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి చెట్ల ఊడలకు అందించారు. చెట్టు చుట్టు పక్కల మూడు వందల ట్రాక్టర్ల ఎర్రమట్టిని పోయించారు. దీని పునరుజ్జీవం కోసం ఇప్పటి వరకు అధికారులు పది లక్షల వరకు వెచ్చించారు. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. నాడు 60 శాతం వరకు ఎండిపోయిన పిల్లలమర్రి నేడు 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ చూడముచ్చటగా దర్శనమిస్తుంది.