English | Telugu
మంత్రి పేర్ని నాని అబద్దం చెప్పారా?
Updated : May 5, 2020
మద్యాన్ని నిషేధించి పేద వారి బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కరోనా కాలంలో వైన్ షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ధర పెంచడం వల్ల పేదలు మద్యానికి దూరమవుతారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. విపక్ష నేతలు మాత్రం ధర పెంచడం వల్ల మద్య నిషేధం సాధ్యం కాదని, అలా జరిగేటట్లయితే అంతలా జనం ఎందుకు ఎగబడతారని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది.
అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలను సమర్ధించుకుంటోంది. కేంద్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఇక ఏపీ మంత్రి పేర్నినాని అయితే, ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అందుకే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయని మంత్రి చెప్పారు.
కాగా, ఏపీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మోడీ సర్కార్ మద్యం అమ్మమని చెప్పలేదు. అది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని, దానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కేంద్రం చెప్పింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ముందువెనక ఆలోచన లేకుండా ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ మద్యం దుకాణాలు తెరిచాయి. అదేమంటే కేంద్రం అనుమతి ఇచ్చింది అంటున్నారు. ఇక మంత్రి పేర్ని నాని అయితే, మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని చెబుతున్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై నెటిజనులు మండిపడుతున్నారు. ఆదాయం కోసం వైన్స్ తెరిచి.. ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చారు, అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయంటూ అబద్దాలు చెబుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమే కదా, ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా ఇంత ఆతృతగా మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.