English | Telugu

తెలంగాణాలో మే 29 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడ‌గింపు!

ఈ రోజు వ‌ర‌కు తెలంగాణాలో 1096 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 628 పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్ల‌కు వెళ్ళారు. ఈ రోజు కూడా 43 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళారు. ప్ర‌స్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా చికిత్స చేయ‌డం, నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో తెలంగాణా దేశానికే రోల్ మోడ‌ల్‌గా వుంది. దేశంలో క‌రోనా డెత్ రేట్ 3.37 కాగా, తెలంగాణాలో డెత్ రేట్ 2.64 వుంది. అలాగే క‌రోనా చికిత్స త‌రువాత కోలుకున్న‌వారు దేశంలో రిక‌వ‌రీ రేట్ 27.40కాగా తెలంగాణాలో రిక‌వ‌రీ రేట్ 57.3 వుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

తెలంగాణాలో వున్న బ‌యోటెక్ సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ ను అగ‌స్టు, సెప్టంబ‌ర్‌లో సిద్ధం చేసి ప్ర‌పంచంలోనే తెలంగాణాకు గుర్తింపు తీసుకురానున్నార‌ని సి.ఎం. కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

తెలంగాణాలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లో వున్నాయి. 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో వున్నాయి. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో వున్నాయి. రాబోయే 11 రోజుల్లో 18 జిల్లాల‌న్నీ గ్రీన్ జోన్‌లోకి వెళ్ళ‌నున్నాయి.

66 శాతం కేసులు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే వున్నాయి. 29 మంది చ‌నిపోతే 25 మంది ఇక్క‌డే చ‌నిపోయారు. కొత్త‌గా వ‌చ్చే కేసులు కూడా హైద‌రాబాద్ ప‌రిధిలోనే వ‌స్తున్నాయి. ప్ర‌జ‌లు భౌతిక‌దూరం పాటించాల్సిందేన‌ని సిఎం మ‌రో సారి పిలుపునిచ్చారు. తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని సి.ఎం. తెలిపారు.

మెజార్టీ ప్ర‌జ‌లు లాక్‌డౌన్ పొడిగించాల‌నే సూచించారు. మంత్రి వ‌ర్గం కూడా పొడిగించాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. మే 29 వ‌ర‌కు రాష్ట్రం లో లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. రాత్రి పూట క‌ర్ఫ్యూ మే 29 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని సి.ఎం. తెలిపారు.