English | Telugu

గాంధీ కరోనా పేషెంట్ మిస్టరీపై స్పందించిన మంత్రి ఈటెల

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా కరోనాతో మృతి చెందిన తన భర్త దహన సంస్కారాలు అధికారులు చేశారంటూ ఓ మహిళ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు చెప్పే డెడ్ బాడీని పోలీసులకు అప్పగించామని చెప్పారు.

తాజాగా, ఈ ఘటనపై మంత్రి ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోయారని.. ఆయన కుమారుడు మధుసూదన్ అదే రోజు ఆస్పత్రికి వచ్చాడని.. 1న చనిపోయాడని అన్నారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామన్నారు. మొత్తం కుటుంబం కరోనాతో బాధ పడుతుండంతో, భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని కుటుంబానికి చెప్పలేదని అన్నారు. ఆ సమయంలో కుటుంబం అంతా ఆస్పత్రిలోనే ఉండటం వల్ల తామే దహన సంస్కారాలు చేసినట్లు తెలిపారు. వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. అప్పటికే ఒకరిని కోల్పోయారని, మరొకరి మృతి చెందారని చెప్తే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు అన్నారని చెప్పారు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేదని మంత్రి ఈటెల అన్నారు.