English | Telugu

చిరంజీవి విన్నపం.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతి...

హైదరాబాద్‌ ‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు సమావేశమయ్యారు. షూటింగులు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై చిరంజీవి, అల్లు అరవింద్, దిల్‌ రాజు, నాగార్జున, రాజమౌళి, కొరటాల శివతో పాటు పలువురితో తలసాని చర్చించారు.

సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?.. థియేటర్లు ఎప్పటి నుంచి పున:ప్రారంభమవుతాయి? అనే విషయాలపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో లేక షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల దర్శకనిర్మాతల కోసమో చేస్తున్న వినతి కాదు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న 14 వేల మంది రోజువారీ సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపం. ఈ 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రిగారికి, ముఖ్యమంత్రిగారికి నేను విన్నవిస్తున్నా.’’ అంటూ ప్రసంగించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని.. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాటికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.