English | Telugu
రాజధాని ఏమైనా జగన్ సొంతిల్లా...ఇష్టమొచ్చినట్లు మార్చడానికి?
Updated : Dec 24, 2019
ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని మందకృష్ణ మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టిన మందకృష్ణ.... సొంత ఇంటి నిర్మాణంలా ఏపీ రాజధానిని మార్చేస్తే కుదరదని అన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, భద్రతకు సంబంధించినదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్‌కు సూచించారు. అయినా, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇవ్వక ముందే సీఎం జగన్మోహన్‌రెడ్డి... మూడు రాజధానులు ఉండొచ్చేమోనని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ తన నివేదికగా ఇచ్చిందనేది స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు. అంటే, తాము అనుకున్నట్లుగా జీఎన్ రావు కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, నిర్మాణ దశలో ఉన్న అమరావతిని వదిలేసి మూడు రాజధానుల ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిని ఇలా మార్చుకుంటూ పోవడం మంచిది కాదన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని మందకృష్ణ సూచించారు. రాజధాని పేరుతో కాకుండా.... పరిపాలనా సౌలభ్యం, శ్రీభాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే అందరూ మద్దతిస్తారని అన్నారు. అయితే, ప్రకాశం జిల్లా దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేసుంటే మూడు ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేదన్న మందకృష్ణ..... జగన్, చంద్రబాబు తీరుతో ఆంధ్రులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు.