English | Telugu

అధికార పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు?? కర్ణాటక రాజకీయాల బాటలో మహారాష్ట్ర

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందిన బీజేపీకే సీఎం కుర్చీ దక్కుతుందా లేదంటే కమలనాథులతో విభేదిస్తున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. 50-50 ఫార్ములాపై బీజేపీ మాట తప్పడంతో శివసేన తన దారి తాను చూసుకుంటోంది. వాస్తవానికి అక్టోబర్ 24 న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 సీట్లు వచ్చాయి. తమ కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నరేళ్లపాటు సీఎం సీటును పంచుకుందామని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ శివసేన మధ్య ఇప్పుడు చీలికలొచ్చాయి. 5 ఏళ్ళ పాటు సీఎం సీటు తనదే అంటూ ఫడ్నవీస్ ప్రకటించడంతో శివసేన తమ దారి తమదేనంటూ కాంగ్రెస్ ఎన్సీపీతో చేతులు కలుపుతోంది.

బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని అంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేస్తున్నారు. శరద్ పవార్ ను ఆయన నివాసంలో కలిసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని తెలిపారు. మెజారిటీ లేని వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. మా పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యాపారులు కారంటూ చతుర్లు విసిరారు. ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది అని బీజేపీకి చురకలంటించారు. నిన్నటి శాసనసభపక్ష సమావేశంలో ఏక్ నాథ్ ఖాడ్సేను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. మహారాష్ట్రలో 50-50 ఫార్ములాపై మాట తప్పిన బీజేపీకి శివసేన చుక్కలు చూపిస్తుందా సీఎం సీటు చెరి రెండున్నరేళ్లు పెంచుకోవాలంటున్న శివసేన అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందా చుడాలి. ఇందుకు ఎన్సీపీ కాంగ్రెస్ కలిసొస్తాయి అంటే అవునని అంటున్నారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న సామెతను ఋజువు చేస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ ను కలిశారు శివసేన ఎమ్మెల్యేలు. అయితే గవర్నర్ ఎవరికి అనుమతిస్తారు ఎప్పుడు అవకాశం కల్పిస్తారన్న ఉత్కంఠ ఇపుడు దేశ రాజకీయాలలో కొనసాగుతుంది.ఇరు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పోలింగ్ కు ముందు ఎలక్షన్ కు వివరాలు సమర్పించాయి.అయితే ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య సీఎం సీటు విషయంలో పంచాయతీ నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటు కు ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీకే అవకాశం ఉంది. మిగతా పార్టీలకు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కమలం పార్టీ చెబుతుంది. ముందే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తర్వాత బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బలనిరూపణకు ఎన్ని రోజుల సమయం ఉంటుందనేది కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇలాంటి అనిశ్చితి మధ్య శివసేనతో దోస్తీ ఉందని చెబుతున్న బిజెపి ఆ పార్టీకి డిప్యూటీ సీఎం సహా 13 మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేస్తోంది.