English | Telugu

తలకిందులైన ఎగ్జిట్ పోల్స్... మహారాష్ట్ర, హర్యానాలో అంచనాలు తారుమారు

మహారాష్ట్ర, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అండ్ మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేస్తాయంటూ ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాటలు తారుమారు అయ్యాయి. ఇక, కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ సర్వే సంస్థలు వేసిన అంచనాలు మొత్తం మారిపోయాయి. ఏ సంస్థా అంచనా వేయని విధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా దృష్టిపెట్టకపోయినా సరే... ప్రజలు మాత్రం పరువు నిలిపారు.

మహారాష్ట్రలో బీజేపీ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. గతంలో పోల్చితే బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గిపోగా... మిత్రపక్షమైన శివసేన మాత్రం భారీగా పుంజుకుంది. ఇక, కాంగ్రెస్ కంటే దాని మిత్రపక్షమైన ఎన్సీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. అసలు కాంగ్రెస్, ఎన్సీపీకి కలిపి50-60 స్థానాలు కూడా దాటవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే... వంద సీట్ల వరకు సాధించాయి.

ఇక, హర్యానాలో బీజేపీ అంచనాలు తప్పాయి. బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ లెక్కలు కూడా తారుమారు అయ్యాయి. గతంతో పోల్చితే భారీగా సీట్లు కోల్పోయిన బీజేపీ.... కనీస మెజారిటీకి ఆరేడు సీట్లు దూరంలో ఆగిపోయింది. ఇక, కనీసం పోటీ కూడా ఇవ్వలేదు అనుకున్న కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. 30కి పైగా సీట్లు సాధించి బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. అలాగే, ఏ పార్టీకి కనీసం మెజారిటీ రాకపోవడంతో హర్యానాలో హంగ్ ఫలితాలు నమోదయ్యాయి. దాంతో ఇండిపెండెంట్స్, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని అటు బీజేపీ... ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.