English | Telugu
మహారాష్ట్రలో కుర్రాడొచ్చాడు... ముఖ్యమంత్రి పీఠంపై శివసేన కన్ను
Updated : Oct 24, 2019
మహారాష్ట్రలో బీజేపీ అంచనాలు తప్పాయి. శివసేన అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీకి మరాఠా ప్రజలు షాకిచ్చారు. గతంతో పోల్చితే బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయి. ఇక, బీజేపీ మిత్రపక్షమైన శివసేన మాత్రం అనూహ్యంగా పుంజుకుని గతంతో పోల్చితే రెట్టింపు సీట్లు సాధించింది. వంద సీట్లకు అటుఇటూగా బీజేపీ ఉంటే.... శివసేన 60 స్థానాలకు పైగా సాధించింది. దాంతో శివసేన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసింది. శివసేన లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేకపోవడంతో... ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ప్రతిపాదిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో శివసేనను ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే లీడ్ చేశారు. దాంతో 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అంతేకాదు రాజకీయాల్లోకి రావడం రావడమే.... ఎవరూ ఊహించని విధంగా పార్టీని ముందుకు నడిపించి... గతంతో పోల్చితే అత్యధిక సీట్లు సాధించేలా చేశారు. దాంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఆదిత్య ఠాక్రే పేరు మారుమోగిపోతోంది. శివసేనను అద్భుతంగా లీడ్ చేయడమే కాకుండా... 60కి పైగా సీట్లు సాధించడతో... ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకే ఇవ్వాలంటోన్న ఠాక్రే అభిమానులు... ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒక, ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకోకపోతే.... కాంగ్రెస్, ఎన్సీపీతో జత కట్టాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే... మరాఠా సామ్రాజ్యానికి కొత్త కుర్రాడొచ్చడనేది అర్ధమవుతోంది. ఒక, శివసేన డిమాండ్ కు బీజేపీ ఒఫ్పుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఆదిత్య ఠాక్రే అధిష్టించడం ఖాయమే.