English | Telugu

దర్శిలో మొదలైన కొత్త తరహ పాలన...

సాధారణంగా నియోజకవర్గాల్లో పెత్తనమంతా ఎమ్మెల్యేలు చేస్తుంటారు. మండల స్థాయిలో అయితే స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు హడావుడి చేస్తుంటారు. వీరితో పాటు అధికార పార్టీ మండల అధ్యక్షులు పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ పని భారం మనకెందుకులే అనుకున్నారో ఏమో మండలానికొక ఇన్ చార్జిగా తన అనుచరులను నియమించుకున్నారట. దర్శి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా నేరుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ని కలవాల్సిన అవసరం లేదు. మండలాలకు నియమించిన ఐదుగురు ఇన్ చార్జ్ లను ఆయా మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రజలు కలిసి తమ పని చేయించుకోవచ్చని ఎమ్మెల్యే చెబుతున్నారట. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ ప్రవేశ పెట్టిన ఈ కొత్త సాంప్రదాయానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అవాక్కవుతున్నారట. ఆ విధంగా మండలాలకు ఇన్ చార్జిల నియామకం నియోజకవర్గంలో చర్చనియాంశమైంది. దీనికి తోడు మండలాలకు ఇంచార్జిలుగా నియమించిన వాళ్లు దర్శి నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు కావడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్నారు.

2019 ఎన్నికల సమయంలో మద్దిశెట్టి వేణు గోపాల్ వైసీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కొద్ది రోజులు నియోజకవర్గంలో పర్యటించిన వేణుగోపాల్ మండలానికొకరిని ఇన్ ఛార్జిలుగా నియమించారట. ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా ఎవరికి కావాలన్నా మండల ఇన్ చార్జిలు ముందుగా ఆమోద ముద్ర వేయాలి. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి పార్టీలో ఉంటున్న తమను కాదని బయట నియోజక వర్గాలకు చెందిన వారిని బండలకు ఇన్ చార్జులుగా నియమించడంతో పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో గెలిపించిన తమను కాదని ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా పెట్టి పెత్తనం చేయిస్తున్నారంటూ కొంత మంది నాయకులు నేరుగా వైసిపి ముఖ్యనేతలకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులను పక్కన బెట్టి పక్క నియోజకవర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జిలుగా నియమించడం స్థానికంగా వివాదాస్పదమవుతోంది. మండల ఇన్ ఛార్జిల పెత్తనం వివాదం నియోజక వర్గ వైసిపిలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.