English | Telugu
కోర్ కమిటీ భేటీలోనూ రేవంతే టార్గెట్... వైఫల్యాన్ని ముందే ఒప్పుకున్న ఉత్తమ్
Updated : Oct 30, 2019
హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఘోర పరాజయం తర్వాత తొలిసారి జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. సీనియర్ల హాట్ కామెంట్స్ తో సమావేశం ఫుల్ హీటెక్కింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైనా... నేతలు మాత్రం తమ మనసులోని మాటను కుండబద్ధలుకొట్టినట్టు బయటిపెట్టారు. ప్రధానంగా పార్టీలో లోపిస్తున్న క్రమశిక్షణపై వీహెచ్ తదితరులు ఘాటుగా రియాక్టయ్యారు. పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని వీహెచ్ మండిపడ్డారు.
ముఖ్యంగా రేవంత్ టార్గెట్ గానే వీహెచ్ కామెంట్స్ సాగాయి. ప్రగతిభవన్ ముట్టడి పిలుపును ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. గతంలో సీనియర్లు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాకముందే.... కార్యకర్తల చేత సీఎం అని అనిపించుకోలేదంటూ రేవంత్ ను నేరుగా టార్గెట్ చేశారు. సభలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారని వీహెచ్ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాకముందే... కార్యకర్తల చేత సీఎం అని పిలుపించుకోలేదని వీహెచ్ గుర్తుచేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలన్న వీహెచ్.... రేవంత్ ను మరోసారి టార్గెట్ చేశారు.
ఇదిలాఉంటే, హుజూర్ నగర్ లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సమావేశం ప్రారంభమైన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. దాంతో మిగతా నేతలంతా విస్మయానికి గురయ్యారు. అయితే, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వొద్దనే ఉత్తమ్ ముందుగానే ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇక, మున్సిపల్ వ్యూహంపై చర్చించిన కోర్ కమిటీ లీడర్లు... ముఖ్యనేతలకు మున్సిపాలిటీల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా మరింత గట్టిగా పోరాటం చేయాలని, ప్రభుత్వ తప్పుడు లెక్కలను, నియంతృత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు.