English | Telugu

వచ్చే రోజుల్లో అయినా కార్మికులకు మంచి జరగాలి : లోకేష్ ట్వీట్

అమరావతి : మే డే సందర్భంగా కార్మికులకు, శ్రామికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదు. అందుకే మే డే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయ్యింది. గతంలో నేను మంత్రిగా నా మొదటి సంతకాన్ని ఉపాధి హామీ చట్టం కింద 30లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్దిచేకూర్చే ఫైలుపైనే చేశాను. భవన నిర్మాణ సంక్షేమ మండలిలో ఉపాధి హామీ కార్మికులకు చోటు కల్పించాను. గడచిన ఏడాది రాష్ట్రంలో కార్మికులకు ఏమాత్రం మంచి జరగలేదు. ఇసుక కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడటం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో కార్మికులు చాలా నష్టపోయారు. అష్టకష్టాలు పడ్డారు. వచ్చే రోజుల్లో అయినా కార్మికులకు, శ్రామికులకు మంచి జరగాలని కోరుకుంటూ, వారందరికి మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.