English | Telugu
కర్ణాటకలో వ్యాపార సంస్థలకు అనుమతి
Updated : May 1, 2020
కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా వాటిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలకు అనుమతి లభించింది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ప్రారంభమైన కార్యకలాపాలు
మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ గడువు ముగియనుండడంతో కర్ణాటక సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతి రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని నిర్ణయించింది.
అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
తాజాగా, కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలు సహా వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. అలాగే, 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. రెడ్ జోన్లయిన బెంగళూరు అర్బన్ తోపాటు 24 కంటైన్‌మెంట్లలో మాత్రం వ్యాపార సంస్థలకు, మాల్స్, సినిమా హాళ్లకు అనుమతి ఉండదని సీఎం స్పష్టం చేశారు.