English | Telugu
ఏపీలో స్ధానిక పోరుకు ఈసీ సమాయత్తం... సిద్ధంగా ఉండాలన్న కనగరాజ్...
Updated : Apr 13, 2020
స్ధానిక ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులు ఎంత మేరకు సహకరించేలా ఉన్నాయి, కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న అంశాలపై అధికారుల నుంచి కనగరాజ్ వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్ధితులపై అధికారులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని తెలిపారు. సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండాలన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని కమిషనర్ కనగరాజ్ తెలిపారు. చక్కటి అవగాహన తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పేరు ను తీసుకుని రావడంలో అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యదార్ధ స్థితిని అధికారులు కమిషనర్ కి వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఏస్.రామసుందర రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ వి సత్య రమేష్ , జెడి సాయి ప్రసాద్, ఎ ఎస్ సాంబ మూర్తి , పీఎస్ రామారావు పాల్గొన్నారు.