English | Telugu

తెలంగాణ వైన్‌షాపుల వద్ద భారీ క్యూ! పండుగ చేసుకుంటున్న మద్యం ప్రియులు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 15 షాపులు కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నాయి. ఆ 15 షాపులు త‌ప్ప మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్‌షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మందుబాబులు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపుల ముందు బారులు తీరి వేచి ఉన్నారు.

చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనంగా పెరిగింది. ఇక మీడియం లిక్కర్‌కు సంబంధించి 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 పెరిగింది. ప్రీమియం లిక్కర్‌ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.30, 375 ఎంఎల్‌పై రూ.60, 750 ఎంఎల్‌పై రూ.120 అదనంగా పెరిగింది.

మరోవైపు స్కాచ్ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 అదనంగా పెరిగింది. ఇక అన్ని సైజుల బీర్‌పై ఫ్లాట్ రూ.30 పెరిగింది.

మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని తెలంగాణా ప్ర‌భుత్వంస్పష్టం చేసింది. మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరచి ఉంచుతారు. ప్రజలు క్రమశిక్షణతో, భౌతిక దూరం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని, మాస్కు ధరించకపోతే మద్యం అమ్మవద్దని, దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచనలు జారీ చేశారు.