English | Telugu

తిరుపతిలో మద్య నిషేధం సాధ్యమేనా? టీటీడీ నిర్ణయంపై ప్రభుత్వ రియాక్షనేంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా తిరుపతిలోనూ మద్యపాన నిషేధం అమలు చేయాలని బోర్డు మీటింగ్ లో తీర్మానించింది. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని టీటీడీ బోర్డు మీటింగ్ లో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అంటే కేవలం తిరుమల మాత్రమే కాదని... పేరులోనే తిరుమల, తిరుపతి కలిసి ఉన్నాయని బోర్డు వ్యాఖ్యానించింది. అయితే, ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితి నెలకొందని, కొందరు ఏకంగా కొండపైకే మద్యాన్ని తీసుకొస్తున్నా పట్టుకోలేని పరిస్థితి ఉందని, ఇక తిరుపతిలోనూ మద్యం నిషేధం అమలు చేస్తే నియంత్రించడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో మద్యాన్ని నిషేధిస్తే స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు. మరి, తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలన్న టీటీడీ బోర్డు నిర్ణయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

తిరుపతిలో మద్యపానాన్ని నిషేధించాలన్న నిర్ణయాన్ని పక్కనబెడితే.... గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ వేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకోనున్నట్లు పాలక మండలి ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు చేశారంటూ విజయసాయిరెడ్డితోపాటు రమణదీక్షితులుపై గతంలో టీటీడీ పరువునష్టం దావా వేసింది. అయితే, ఆ దావాను ఉపసంహరించుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.