English | Telugu

మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం..!

విజయనగరం కలెక్టరేట్‌ సాక్షిగా మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం బయటపడింది. మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు... స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన బాధితులు... మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ ఆగడాలపై ఏకరువు పెట్టారు. మంత్రి బొత్స అండదండలు ఉన్నాయనే భరోసాతో తమ భూముల్లో బొత్స ఆదినారాయణ దౌర్జన్యంగా గోడలు కట్టారంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. విజయనగరం జిల్లా జేసీ, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాము మధ్యతరగతి కుటుంబాల వారమని, దాదాపు 40ఏళ్లు కష్టపడి విజయనగరం సత్యసాయినగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 53/4, 53/5లో స్థలాలను కొనుగోలు చేశామని... అయితే ఇఫ్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు బొత్స ఆదిబాబు ప్రయత్నిస్తున్నారంట కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ, అశోక్ కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ తదితరులు దాదాపు 40మంది బాధితులు వాపోయారు.

సొంతిళ్లు కట్టుకోవాలని రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుక్కుంటే ఇఫ్పుడు ఇలా కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా అధికార వైసీపీ నేతలే భూకబ్జాలకు పాల్పడుతుంటే తమ గోడు ఇంకా ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించి భూములు కట్టేశారని... అయితే, భూములకు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు తమ దగ్గర ఉన్నాయని అధికారులకు ఆధారాలు సమర్పించారు. తాము ఇల్లు కట్టుకోవడంలో ఆలస్యం కావడంతో ... తన అంగబలంతో మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ... ఆ స్థలం చుట్టూ గోడను నిర్మించారని బాధితులు వాపోతున్నారు. తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.