English | Telugu
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ పైచేయి... ఉద్యోగులందరికీ ఇదో హెచ్చరిక...
Updated : Oct 23, 2019
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మొదట్నుంచీ కఠిన వైఖరిని ప్రదర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తన మాట నెగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. ఆరునూరైనాసరే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన కేసీఆర్... తన స్టాండ్ లో మార్పు లేదని మరోసారి స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, వాళ్లసలు ఉద్యోగులే కాదంటూ ప్రకటించిన కేసీఆర్... ఇక చర్యలు జరిపే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ తీర్పు కాపీ ఇంకా అందలేదంటూ మూడ్రోజులు ఆలస్యంగా చర్చల ప్రక్రియపై స్పందించారు. అయితే, కార్మికులతో అసలు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ముందుగా, ఆర్టీసీ మరో ఆల్విన్ కాకూడదనే తమ ప్రయత్నమంటూ ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పేరుతో మీడియాకి ప్రకటనలిచ్చిన ప్రభుత్వం... అర్ధరాత్రి తర్వాత చర్చల ప్రక్రియ కోసం కొత్తగా కమిటీని వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, హైకోర్టు తీర్పు కాపీపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నందున ఇతర డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే చర్చలకు రాబోమని తామెప్పుడూ చెప్పలేదంటూ కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపినట్లు తీర్పు కాపీలో ఉన్నట్లు కేసీఆర్ ప్రస్తావించారు. దాంతో దేనికోసమైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారో... ఆ ప్రధాన డిమాండును వదులుకున్నట్లయ్యింది. అంతేకాదు హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీకే చర్చలు జరపాలని ఆదేశించడంతో ఆయనే స్పందించేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరుగురు అధికారులతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చాక ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కోర్టుకు నివేదించనున్నారు.
అయితే, ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ కఠిన వైఖరి, తన మాటే నెగ్గాలన్న మొండితనం... మిగతా ఉద్యోగులందరికీ ఒక హెచ్చరికలాంటిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుముందు ఇతర ఉద్యోగ సంఘాలు ఏవైనా డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరముందంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు... ముఖ్యంగా టీజీవోలు, టీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాలు.... ఇటీవల సీఎస్ కు ఇఛ్చిన డిమాండ్లపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాట వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ పైచేయి సాధిస్తే... అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక హెచ్చరికలాంటిదే.