English | Telugu

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కే. కవిత పేరు ఖరారైంది. ఈ స్థానికి ఎమ్మెల్సీగా ఉండే ఆర్. భూపతి రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు పోటీ పడ్డారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ స్థానాన్ని కవితకే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బయల్దేరేముందు మినిస్టర్ క్వార్టర్స్ లో స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కవిత భేటీ అయ్యారు. ఆమెకు స్వీకర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బిజెపి ఎన్నికల బరిలో ఉన్నప్పటీకి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7వతేదీన పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.

గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కవిత.. ఇప్పుడు తాజా నిర్ణయంతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనబోతున్నారు. రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చినా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకొనేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడుతున్న కవితకు సీఎం కేసీఆర్ మరో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న కవితకు మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం.