English | Telugu
శారదాపీఠంలో విష జ్వరపీడా హర యాగం
Updated : Mar 18, 2020
* కరోనా వైరస్ ప్రబలకుండా హోమాలు
* యాగంలో పాల్గొనేందుకు హిందూ ధర్మ ప్రచార యాత్ర వాయిదా
* సామాజిక బాధ్యతగా యాగం చేపట్టామన్న స్వామి స్వాత్మానంద
కరోనా వైరస్ నేపథ్యంలో విషజ్వర పీడా హర యాగాన్ని విశాఖ శారదాపీఠం చేపడుతున్నట్లు ప్రకటించారు ఆ పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి. బుధవారం నుంచి పీఠం ప్రాంగణంలో విషజ్వర పీడా హర యాగంతో పాటు శాంతి హోమం కూడా ఉంటుందన్నారు. సామాజిక స్పృహతో విశాఖ శారదాపీఠం ఈ యాగాన్ని చేపట్టిందన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి విశిష్ట ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించి యోగవాశిష్టంలో సూచించిన మేరకు 11 రోజులపాటు యాగాల నిర్వహణకు సంకల్పించారని తెలిపారు. యాగంలో పాల్గొనేందుకు హిందూ ధర్మ ప్రచార యాత్రను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.
రాజమండ్రిలో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన స్వామి స్వాత్మానందేంద్ర సామాజిక బాధ్యతగా భావించి యాగం చేపట్టామన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రపంచ శ్రేయస్సు కోరుతూ ఈ యాగానికి శారదా పీఠం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రజలు కూడా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గో సేవ చేయాలని, గోధూళి ,గోపంచకం వల్ల ఎలాంటి రోగాలు రావన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు తులసి మొక్కలు నాటాలని సూచించారు. శారదా పీఠం ఆధ్వర్యంలో వనమూలికలతో కూడిన వనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలు, ఇళ్లల్లో ఔషధ మొక్కలు నాటాలని స్వాత్మానందేంద్ర సూచించారు. భారతదేశపు ఆచార సాంప్రదాయాల వల్లే ఈ దేశంలో ఎలాంటి రోగాలు పుట్టడం లేదన్నారు. అంటువ్యాధులన్నీ ఇతర దేశాల నుంచి వ్యాప్తి చెందుతున్నవేనని తెలిపారు.