English | Telugu
దేవుడితోనూ రాజకీయాలు.. జోగి రమేష్ ఒట్లను ఎవరైనా నమ్ముతారా?
Updated : Oct 27, 2025
వైసీపీ నేతలు రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడికి వెళ్లి ప్రమాణం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా, ఇంకా చెప్పాలంటే.. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్.. నకిలీ మద్యం కేసులో తాను నిర్దోషిననీ, తనకేమీ తెలియదనీ బుకాయిస్గున్నారు. అసలు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియనే తెలియదనీ గట్టిగా చెబుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. అద్దేపల్లిజనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జోగి రమేష్ తన బుకాయింపులను కొనసాగిస్తున్నారు.
నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే దుర్గమ్మ కాళ్ల వద్దే ఉరేసుకుంటానని ఈ సందర్భంగా జోగిరమేష్ అన్నారు.
అయితే ఇక్కడ ఆయన ప్రమాణాలు, ప్రతిజ్ణలను జనం నమ్మే పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్ధనరావు పోలీసు కస్టడీలో విషయం మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఇందులో సందేహాలకు అతీతంగా జోగి రమేష్ ప్రమేయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించేశారు. ఈ నేపథ్యంలోనే జోగు రమేష్ దేవుడి మీద ప్రమాణాలంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయం నుంచీ జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్ల అద్దేపల్లి చెబుతున్నారు. అప్పటి లెక్కలు బయటపెట్టడమే కాకుండా.. తాజా నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారంలో జోగురమేష్ తో తాను చేసిన చాట్ల స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ బుకాయింపులను, ప్రమాణాలను, ప్రతిజ్ణలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.