English | Telugu

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

కల్వకుంట్ల కవిత జనం బాట పాదయాత్రను శనివారం (అక్టోబర్ 25) నిజమాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలలో పర్యటించనున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట తాను ఎక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారో సరిగ్గా అదే నియోజకవర్గం నుంచి ఆమె తన కొత్త రాజకీయ బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగంలో.. సొంత పార్టీయే తనను దగా చేసిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రవల్లనే తాను నిజామాబాద్ లో పరాజయం పాలయ్యానన్నారు. జనం కాదు.. తనను సొంత పార్టీయే ఓడించిందని చెప్పుకున్నారు.

తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పిన కవిత.. ఆ కారణంగానే పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా నిశ్శబ్దంగా ఉన్నాననీ, అయితే ఇప్పుడు.. తనను పార్టీ నుంచి బయటకు పంపేశారనీ, అందుకే తిరిగి తన ప్రజల వద్దకు వచ్చానన్నారు.
ఈ సందర్భంగా కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ సందర్భంగా వారి అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకున్నారు. చర్విత చరణమే అయినా కవిత.. తాను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు చెప్పుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమె తాను కోత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. తాను స్వతంత్రంగా, స్వంతంగా రాజకీయాలలో రాణించాలని భావిస్తున్నట్లు చెప్పిన కవిత, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఒకే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆమె ఎవరిని బెదరించాలని చూస్తున్నారో అవగతం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.కవిత తెలంగాణ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారా? లేదా వేచి చూడాల్సిందేనంటున్నారు.