English | Telugu
గుర్తులపై అభ్యంతరాలు..ఓటమి అంగీకారమేనా?
Updated : Oct 27, 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెల 11 ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది నుంచున్నా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందన్నది నిర్వివాదాంశం. మూడు పార్టీలకూ కూడా ఈ ఉపఎన్నికలో విజయం చావో రేవో అన్నట్లుగానే పరిణమించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలో విజయం తమ పాలనకు లిట్మస్ టెస్టుగా భావిస్తుంటే.. ఉనికి, సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిలో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంది.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి.. జూబ్లీ ఉప ఎన్నికలో గెలుపు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కోసం మూడు పార్టీలూ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమను గెలుపు బాటలో నడిపిస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తుంటే.. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ అయితే మోడీ కరిష్మాపై ఆధారపడి బరిలోకి దిగింది.
ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అధికార పార్టీపై విమర్శల దూకుడు పెంచింది. అదే సమయంలో ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. అదే ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందా అన్న అనుమానాలు కలిగేలా చేస్తోందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తులపై చేస్తున్న అభ్యంతరాలేమిటయ్యా అంటే.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన చపాతీ రోలర్, సబ్బు డిష్, కెమెరా, రోడ్ రోలర్, షిప్ వంటి వి బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును పోలి ఉన్నాయని చెబుతోంది. దీని వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాదిస్తోంది. ఆ అయోమయం కారణంగా ఓటర్లు కారు గుర్తుకు వేయాల్సిన ఓటును పైన చెప్పిన వాటిలో దేనికో ఒక దానికి వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఇదే ఆ పార్టీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎంలో గుర్తుతో పాటు అభ్యర్థి పేరు, ఫొటో కూడా ఉంటాయి కనుక అయోమయానికి ఎక్కడ అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఓటమి భయంతోనే గుర్తుల అయోమయం అంటూ బీఆర్ఎస్ అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదని ఎద్దేవా చేస్తున్నాయి. పోలింగ్ కు ముందే ఓటమికి సాకులు వెతుకుతున్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని అంటున్నాయి.