English | Telugu

జో బిడెన్.. ట్రంప్ తో సమరానికి సై!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్య‌ర్థిగా 'జో బిడెన్' అధికారికంగా ఖరారయ్యారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు రూట్ క్లియర్ అయ్యింది. దీంతో, న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అధ్యక్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్‌ తో బిడెన్ తలపడనున్నారు. .

‌77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిడెన్‌ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి బిడెన్‌ ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించారు. అయితే, డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. తాజాగా, మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు.

ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడంపై బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని అన్నారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవిచూస్తోందని, 1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అంటూ ట్రంప్ పై విమర్శలు కూడా మొదలుపెట్టారు. త్వరలో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.