English | Telugu
రాజంపేటలో రాజుకుంటున్న చిచ్చు.. ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న వైసీపీ కార్యకర్తలు
Updated : Jan 5, 2020
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ టిక్కెట్ కూడా సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. పార్టీలో.. ప్రభుత్వంలో.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా ఉన్నారు. ఎప్పటిలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. సాధ్యమైనంత వరకు మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డితో సమన్వయంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పార్టీ విషయంలో కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్ తో కలిసి సాగిన ఆయన మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదనే భాధలో ఉన్నారు. గత ఎన్నికల్లో వివిధ సమీకరణాల దృష్ట్యా జగన్ ఆకేపాటిని కాదని టిడిపి నుంచి వచ్చిన మేడాకు టికెట్ ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన జగన్ కు తన విధేయత ప్రదర్శిస్తూ మేడ గెలుపునకు కృషి చేశారంటున్నారు. కానీ లోలోపల అసంతృప్తి మాత్రం అలానే ఉంది. అసలు సమస్య అక్కడే మొదలయిందని అంటున్నారు.
ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆకేపాటి మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి నియోజకవర్గంలో తన పెత్తనాన్ని కొనసాగించేందుకు ఆరాటపడుతున్నారు. వైసిపిలో పాత పరిచయాలను ఉపయోగించుకుంటూ జిల్లా మంత్రులను ఇన్ చార్జిలను తన ఇంటికి పిలిపించుకుంటూ పరపతిని చూపించుకుంటున్నారు. అధికార కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే మేడా లేకుండానే పూర్తి చేస్తున్నారు. ఆకేపాటి వ్యవహారం పై ఎమ్మెల్యే మేడా వర్గీయులు కాస్త గుర్రుగా ఉన్నారు. ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఇసుక రీచ్ ల ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే మేడా లేకుండానే ఆకేపాటి సమక్షంలో మంత్రులు ప్రారంభించేశారు. జనవరి 24 నుంచి రాజంపేటలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వేరువేరుగా పర్యవేక్షిస్తుండటం కార్యకర్తల్లో అయోమయం మొదలైంది. కార్యకర్తలకు సమస్య వచ్చి పోలీస్ స్టేషన్ కు వెళితే ఆకేపాటి చేయమంటే ఎమ్మెల్యే మేడా వద్దంటున్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కూడా ఇదే పరిస్థితి, వీరి మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారం ముదరకముందే జగన్ నచ్చజెప్పితే మంచిదని కార్యకర్తలు అంటున్నారు.