English | Telugu

కూలీలకు లోటు రానివ్వొద్దు: సీఎం జగన్

రహదారులపై నడుస్తూ వెళ్తున్న వలస కూలీలకు భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివ్వొద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దన్నారు. ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సాయం చేయాలని స్పష్టంచేశారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదేనని సీఎం సూచించారు. రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలకు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై సీఎంకు అధికారులు వివరించారు.
కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామని, వారిని తిరిగి బస్సుల్లో పంపించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మందిని, కృష్ణా జిల్లా నుంచి 16 బస్సుల్లో 410, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని పంపించామన్నారు. ఇవాళ గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లా నుంచి 52 మంది వలస కూలీలను పంపిస్తున్నామని చెప్పారు.