English | Telugu
వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టు ఫైర్.. సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదు?
Updated : May 20, 2020
వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వీరిపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా వ్యాప్తి చెందేలా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దారులు కోరారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్, విడుదల రజనిలకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా హైకోర్టుకు ఫిర్యాదు అందింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శ్రీదేవిపై న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌తో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.
వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్ ఉల్లంఘనపై దాఖలైన పటిషన్లను ఈరోజు విచారించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపైనా, నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించని ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు.. వారిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో, లబ్ధిదారులతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇలా జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్ వాదించారు. ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.