English | Telugu

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలు.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈమేరకు తీర్పు వెలువరించింది.

రాష్ట్రంలో 48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. 1992లో ఇందిరా సహానీ కేసులో, 2016లో వచ్చిన జయరాజు కేసులో కొన్ని మినహాయింపులకు అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే, అవేమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని.. 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ స్పష్టం చేసింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తెలిపింది.