English | Telugu

రాష్ట్రమంతటా భారీ వర్షాలు,పొంగి పొర్లుతున్న వాగులు...


కేరళ, కర్నాటక రాష్ట్రాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కీ, త్రిస్సూర్, పాలక్కాడ్, మళప్పురం జిల్లాలలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకుళం, కోజీకోడ్, వాయినాడు తదితర తొమ్మిది జిల్లాలలో ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు కొచ్చి లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దానితో రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎర్నాకుళంలో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఇల్లూ దుకాణాల్లోకి నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఇక పతన మిట్ట జిల్లాలోని తుంపామన్ వద్ద పంబా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని పాలకడవు వద్దా కావేరి డేంజర్ మార్కు దాటి పరవళ్లు తొక్కుతుంది.

కేరళలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కర్ణాటక లోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ కర్ణాటక లోని కొడుగు, మైసూరుజిల్లాలో ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ద్వారక్, బెల్గావి, కులబర్గి, గదక్, విజయపురా, బాగల్ కోట్, శివమొగ్గ, చిక్ మంగళూరు జిల్లాలలో పరిస్థితి అధ్వానంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ప్రభుత్వ భవనాలలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వరదలకు బెల్గావి లోని షాపూర్ లో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బెల్గవి. గోవా రోడ్డుపై జంబోటి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. బెల్గావి జిల్లాలో గోకల్ ఫాల్స్ వద్ద ఘాట్ ప్రభా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

ద్వారాట్ జిల్లాలోని నావల్ గుండ్ వద్ద కృష్ణా డేంజర్ మార్కును దాటింది.ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కుండ పోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజులు ఎడ తెరిపి ఇచ్చిన వర్షాలు ఇప్పుడు మహారాష్ట్రను మళ్లీ ముంచెతుతున్నాయి. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో షోలాపూర్ లో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సతారలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పూణెలో కురిసిన భారీ వర్షాలకు వరద పరిస్థితి తలెత్తింది. రోడ్ల పై పీకల్లోతు నీరు నిలిచిపోవడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబయిలోనూ భారీ వర్షం కురిసింది. మరో ఇరవై నాలుగు గంటల పాటు కొల్లాపూర్, సతారా, సంగ్లీ, షోలాపూర్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలను,జాగ్రత్తలను తీసుకుంటే కానీ ప్రమాదాల నుంచి బయట పడవచ్చని స్పష్టమవుతోంది.