English | Telugu
డాక్టర్లు, నర్సులకు గ్రీన్ కార్డు!అమెరికా కాంగ్రెస్ బిల్లు
Updated : May 11, 2020
కరోనా కారణంగా అమెరికా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ డెడ్లీ వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా 2,80,000 మంది చనిపోతే అమెరికాలోనే 80 వేల మరణాలు ఉన్నాయి. 13 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా గజగజ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టారు. డాక్టర్లు, నర్సులకు తక్షణమే గ్రీన్ కార్డు లభించేలా అమెరికా కాంగ్రెస్ బిల్లును తీసుకు వచ్చింది. అమెరికాలో స్థిరపడటానికి ఈ బిల్లు ద్వారా డాక్టర్లు, నర్సులకు అవకాశం లభించింది.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 25,000 మంది నర్సులు, 15,000 మంది డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉండాలనుకునే H1B, J2 వీసాలపై ఉన్న ఇండియన్ డాక్టర్స్, నర్సులకు ఇది ప్రయోజనం. అమెరికాలో వివిధ కంపెనీలలో పని చేసేందుకు H1B వీసాలను మంజూరు చేస్తుంది అమెరికా. చైనా, భారత్ నుండి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి.
అమెరికాలో ఇప్పుడు డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ది హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీసైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్ కార్డులకు అనుమతిచ్చే అధికారం కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం పొందవచ్చు. గ్రీన్ కార్డు అంటే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. గతంలోనే కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ జారీ కానీ గ్రీన్ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.