చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పార్టీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత కాలం నన్ను ఆదరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్, జిల్లా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతాననేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పట్లో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. నా అనుచరులు, మద్దతుదారులెవ్వర్నీ టీడీపీ నుంచి దూరం చేసే ఆలోచన లేదు. టీడీపీ మీద నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని మనోహర్ తెలిపారు.
కాగా, ఆర్థికమూలాలను దెబ్బతీసేలా అధికార పార్టీ ఎత్తుగడలు వేయడంతోనే.. తప్పని పరిస్థితుల్లో మనోహర్ టీడీపీకి రాజీనామా చేసారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు చెందిన క్వారీకి రూ.కోట్లలో జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం అందటంతో.. ఈ పరిస్థితుల్లో టీడీపీకి దూరంగా ఉండటమే మేలని భావించిన ఆయన పార్టీకి రాజీనామా చేశారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.