English | Telugu

విద్యుదాఘాతాలు.. భాగ్యనగరంలో భద్రత గాలిలో దీపమేనా?

హైదరాబాద్లో విద్యుత్ తీగలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. నగరంలో నిత్యం యాత్రలు, ప్రదర్శనలు, ఊరేగింపులూ జరుగుతూనే ఉంటాయి. అటువంటి సందర్భాలలో విద్యుత్ తీగలు జనాలకు మరణశాసనం లిఖిస్తున్న సందర్భాలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక రోజు వ్యవధిలో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మరణించిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా పాతబస్తీ బండ్లగూడలో గణేశ్‌ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే అంబర్‌పేట్‌లో ఒక యువకుడు విద్యుత్‌ తీగలను తొలగించే క్రమంలో షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు శ్రీకృష్ణాష్ఠమి శోభాయాత్ర సందర్భంగా రామంతాపూర్ లో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలన్నీ కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగినవే.

కృష్ణాష్ఠమి శోభాయాత్ర సందర్భంగా రథాన్ని లాగుతున్న జీపు ఆగిపోవడంతో భక్తులు చేతులతో తోస్తూ ముందుకు తీసుకెళ్లారు. కానీ వేలాడుతున్న విద్యుత్‌ తీగ రథానికి తగిలి షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో షాక్‌ తగిలి తొమ్మిది మంది కుప్పకూలారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఇక సోమవారం నాడు నగరంలో జరగిన రెండు సంఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో గణేశ్‌ విగ్రహం తరలింపు సమయంలో విద్యుత్‌ తీగలను కర్రతో పైకెత్తే ప్రయత్నంలో షాక్‌ తగిలి ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి సంభవించింది. అంబర్ పేటలో విద్యుత్ తీగలను తొలగిస్తూ ఓ యువకుడు మరణించాడు. విగ్రహాల తరలింపు, ఉరేగింపు, శోభాయాత్రల సమయంలో విద్యుత్ శాఖ, పోలీసులు, మునిసిపల్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

అయితే.. అవి విమర్శలు కాదు వాస్తవాలే అని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ప్రదర్శనలు, ఊరేగింపులు, శోభాయాత్రల మార్గంలో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఎక్కడ ఉన్నాయో గుర్తించి, ఆ మార్గంలో సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఈ మూడు శాఖలూ సమన్వయంతో పని చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగే అవకాశాలుండవని అంటున్నారు. ఇప్పటికైనా.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.