English | Telugu
జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ నిజమేనా?
Updated : Aug 19, 2025
గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు కానీ, ఆయన పార్టీ వైసీపీ తీరు కానీ ఇసుమంతైనా మారలేదు. మారడం అటుంచి ఓటమి తరువాత అన్నీ తామే, అన్నిటా తామే అన్నట్లుగా సొంత భజన చేసుకోవడంలో ఆ పార్టీ అధినేత, నాయకులు, శ్రేణులు మరింత ఆరితేరిపోయారు. అందుకు తాజాగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ తాజా సొంత భజన ఏమిటంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ సభ్యుల మద్దతు కోరుతూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారట. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి గట్టెక్కాలంటూ మీ మద్దతు అవసరం అంటూ ప్రాధేయపడ్డారట. అందుకు జగన్ పార్టీలో చర్చించి మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెబుతాననన్నారట.
ఏ విధంగా చూసినా వైసీపీ చేసుకుంటున్న ప్రచారం నమ్మశక్యంగా లేదంటున్నారు. వాస్తవానికి ఉప రాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం కంటే ఎన్డీయేకిఎక్కువే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ మద్దతు కోసం జగన్ కు ఫోన్ చేసి మరీ అన్యధా శరణం నాస్తి అంటూ ప్రాథేయపడాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఆ విషయం తెలియని వారెవరూ ఉండరు. అయినా.. అంటే ఎవరూ నమ్మరని తెలిసినా సొంత బాజా వాయించుకునే విషయంలో వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ముందుకు సాగుతున్నారు.
వాస్తవానికి అడిగినా, అడగకపోయానా ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వినా మరో గత్యంతరం లేని దుస్థితిలో వైసీపీ ఉంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల భయంతో.. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేసే పరిస్థితి లేదు. అంతే కాదు.. బీజేపీ ప్రాపకం కోసం వారు అడగడానికి ముందే అన్ని విషయాలలోనూ కమలం పార్టీకీ, ఆ పార్టీ అగ్రనేతలకూ జై అనక తప్పని పరిస్థితి. వాస్తవం ఇలా ఉంటే.. వైసీపీ మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి ప్రాథేయపడ్డారంటూ ప్రచారం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.