English | Telugu
వీడని చిన్నారి కిడ్నాప్ మిస్టరీ... మృతదేహాన్ని మాయం చేసిన సవతి తల్లి
Updated : Nov 25, 2019
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తీశ్రీ కిడ్నాప్ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం ( నవంబర్ 22న ) స్కూల్ నుంచి తీసుకొస్తానని వెళ్లిన సవతి తల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే హత్య చేయడానికి గల కారణాలు.. చిన్నారిని హతమార్చిన కేసులో నిందితురాలి శాంతకుమారి కాకుండా ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీప్తీశ్రీ ని గొంతు నులిమి చంపానని అంగీకరించిన సవతి తల్లి మృతదేహాన్ని ఎక్కడ పడేసిందని అడిగితే మాత్రం నోరు మెడపటంలేదు. అది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
చిన్నారి కిడ్నాప్ కు గురైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. స్కూలు నుంచి చిన్నారిని తీసుకుని కొద్ది దూరం వరకు నడిపించుకొని తీసుకెళ్లి అటుపై వేరే వ్యక్తి బైక్ పై తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. దీప్తీశ్రీ నాయనమ్మ బంధువులు చెప్పిన వివరాల్ని బట్టి కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. కిడ్నాప్ కు గురైన రోజు శాంతకుమారితో పాటు మరో వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో వేర్వేరు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఇక పాప మృతదేహం కోసం కాకినాడ సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో వెతుకుతున్నారు. బాలిక డెడ్ బాడీని గాలించేందుకు ధర్మాడి సత్యం బృందం నుండి 15 మందిని పిలిపించారు.
మరోవైపు దీప్తీశ్రీ మృతదేహం ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి దీప్తీశ్రీ మిస్సింగ్ కేసులో పూర్తి వివరాలు రాబడుతున్నామని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఇక చిన్నారి సవతి తల్లి ఇచ్చిన వివరాల ప్రకారం మృతదేహం కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమా..లేక వేరే ఏమైనా విషయాలు దాగి ఉన్నాయా.. అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నామనని తెలిపారు. తమ విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు డీఎస్పీ కరణం కుమార్.