English | Telugu
ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే.. నిధుల్లేక తలలు పట్టుకుంటున్న జగన్ సర్కార్!!
Updated : Nov 25, 2019
ఆంధ్ర ప్రదేశ్ లో తాగు నీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. తీవ్ర నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. బ్యాంకులు రుణం ఇస్తేనే పనులు సాగే దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సమీక్ష జరిపే వరకు పనులు ముందుకు సాగనీయ వద్దంటూ జల వనరుల శాఖకు ఆదేశాలొచ్చాయి. దీంతో కమిటీ నివేదిక కోసం కొంత కాలంగా ఆ శాఖ పనులన్నీ ఆపేసింది. హంద్రీ నీవా గాలేరు నగరి సుజల స్రవంతిలో అక్రమ చెల్లింపులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టులను అదనపు చెల్లింపులు జరిగాయని కమిటీ తేల్చడంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రివర్స్ టెండర్ కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఒకే ప్యాకేజీ గా రివర్స్ టెండర్ కు వెళ్లారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జల వనరుల శాఖ మూడుసార్లు సీఎంతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన ఎలాంటి స్పష్టత రాలేదు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ ఏడాది 7,687 కోట్లు అవసరమని సీఎం ఈ నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ నివేదిక ఇచ్చింది. అయితే ఈ 7,687 కోట్ల విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం భారీ సాగు నీటి ప్రాజెక్టులకు స్కెచ్ వేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను పంపి రాయలసీమకు సాగు, తాగు నీరు అందించే భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు వ్యయం అవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశాలు నిర్వహించినా చివరకు రైతుల లేమి కారణం తోనే ఈ భారీ ప్రణాళికకు దాదాపు పుల్ స్టాప్ పెట్టినట్టుగా జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి.
పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బానకచెర్ల వరకు గోదావరి జలాలను ఎత్తిపోసే మరో పథకానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి 80 వేల కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపధ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి పూర్తికావాలన్న బ్యాంకు రుణాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జలవనరులశాఖ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని నుంచి బ్యాంకు రుణాలు పెద్ద మొత్తంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. అయితే రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి ఎత్తిపోతల పథకాలు మధ్య తరహా ప్రాజెక్టుల కోసం తీసుకున్న వేల కోట్ల రుణాలకు ఇప్పటికే భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అయితే ఈ కార్పొరేషన్ లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయ అనే సందేహాలున్నాయి.