English | Telugu

సీన్ రివర్స్... 30వ తేదీన బలపరీక్షకు సిద్ధమంటున్న బీజేపీ

మహారాష్ట్ర లో మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. బలనిరూపణ కోసం కాంగ్రెస్, శివసేన సుప్రీం కోర్టుకెక్కితే బిజెపి మాత్రం నవంబర్ 30 న జరగబోయే బలపరీక్ష పై ఫోకస్ పెట్టింది. బలపరీక్ష వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీం కోర్టు నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు బీజేపీ నేతలు. బలపరీక్ష నాడు గట్టెక్కడం ఖాయమని సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం ఫడ్నవీస్ సమావేశం నిర్వహిస్తే.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ తదితర నేతలు కోర్టు నిర్ణయం పై ఎప్పటికప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు.

మహారాష్ట్ర లోని అన్ని పార్టీలూ డేగ కన్నేశాయి. ఉద్ధవ్ ఠాక్రే తదితర శివసేన నేతలు ఎన్సీపీ ఎమ్మెల్యేలను స్వయంగా కలిశారు. ఇక ముంబయి లోని హోటల్ లలిత్ లో బస చేసిన శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే భేటీ అయ్యారు. బిజెపి ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉంటున్న ఎన్సీపీ అధినేత పవార్ తమ ఎమ్మెల్యేలను సాయంత్రం రెనైజోమ్స్ హోటల్ కు తరలించారు. 41 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని ప్రకటించారు శరత్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఒక హోటల్ నుంచి మరోచోటికి తరలించారు. అలాగే ఈ రోజు సుప్రీం కోర్టు విచారణకు సరికొత్త వ్యూహ రచన చేశారు శరత్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సుప్రీంకోర్టును అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో జరగాల్సిన వ్యవహారమంతా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలతో అఫిడవిట్ లు దాఖలు చేయించే దిశగా ఎన్సీపీ అడుగులు వేస్తుంది. బిజెపి తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో బలపరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతుంది. 30వ తేదీన బలపరీక్ష ఉండటంతో అప్పటికి చాలా టైముంది కనుక ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కత్తిమీద సాములాంటిదనే అంటున్నారు విశ్లేషకులు. అప్పటి వరకు ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవరూ ఊహించని పరిస్థితి.