English | Telugu

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్!

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ప్రత్యేక జాగ్రత్తల మధ్య గైనిక్ వైద్య బృందం మహిళకు డెలివరీ చేశారు. తొలి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేసి గాంధీ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు.

సదరు మహిళ కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు డాక్ట‌ర్లు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. అరుదైన ఈ ఘనతను సాధించిన వైద్యులను మంత్రి ఈటల అభినందించారు. అయితే ఈ మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.