English | Telugu

కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి! 40 లక్షల కేసులు! 2 ల‌క్ష‌ల 70 వేల మంది బ‌లి!

ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని కబళిస్తూ కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది. వైరస్ ఉద్ధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడీ మహమ్మారి బ్రెజిల్‌ను పట్టి పీడిస్తోంది. గత 24 గంటల్లో ఇక్కడ ఏకంగా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.36 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్క రోజే కొత్తగా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 610 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 9,146కు చేరుకుంది.

బ్రెజిల్ దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కి అల్లాడుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మాత్రం ఏమీ పట్టనట్టగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధికార ప్రతినిధి ఒటావియో బారోస్ కూడా కరోనా బారినపడినా అధ్యక్షుడు మాత్రం కరోనా విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలు ఉన్నాయి. బ్రిటన్‌లో తాజాగా మరో 626 మంది మరణించగా, వీరిలో ఆరు వారాల చిన్నారి కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన దేశాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జర్మనీలో నిన్న 1,209 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1.67 లక్షలకు చేరింది. స్విట్జర్లాండ్‌లో నిన్న 81 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 30,207కు పెరగ్గా, ఇప్పటి వరకు 1,526 మంది మృత్యువాత పడ్డారు.