English | Telugu

700కు పెరిగిన పాజిటివ్ కేసులు! ఈనెల 20న గచ్చిబౌలి కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం!

తెలంగాణలో ఈరోజు కొత్త‌గా మ‌రో 50 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరిందని వైద్య, ఆరోగ్యం శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్ల మంత్రి తెలిపారు. ఈనెల 20న గచ్చిబౌలిలో కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఢిల్లీ మర్కజ్ ప్ర‌కంప‌న‌లు తెలంగాణాలో క‌ల‌క‌లం రేపుతూనే వున్నాయి. ఇప్ప‌ట్టి వ‌ర‌కు తెలంగాణాలో వ‌చ్చిన 700 పాజిటివ్ కేసుల్లో 500కు పైగా మ‌ర్క‌జ్ మూలాల‌కు సంబంధించిన‌వేన‌ని మంత్రి ఈట‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతూనే వున్నాయి. అయితే వీటిలో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. క‌రోనా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తుండగా.. ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గురువారం ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణాలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులపై కేబినెట్‌ భేటీ తర్వాతే స్పష్టత వస్తుంద‌ని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు ల్యాబ్‌లకు అనుమతి వచ్చిందని, దీంతో రోజుకు 5వేల టెస్ట్‌లు చేసే సామర్ధ్యం వస్తుంద‌ని మంత్రి ఈటెల తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందికీ రక్షణ పరికరాలు ఇస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.