ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. కరోనాతో కర్నూలు జిల్లాకి చెందిన ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. కాగా గత 24 గంటల్లో 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు.