English | Telugu
'ఎల్జీ పాలిమర్స్' కి మేం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు: సీఎం జగన్
Updated : May 18, 2020
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో సీఎం జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి తమ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు. ఆ సంస్థకు అనుమతి, విస్తరణకు ఆమోదం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని చెప్పారు. అయినప్పటికీ తాము రాజకీయంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదని, మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని, పదిరోజుల వ్యవధిలోనే బాధితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. గతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయినప్పుడు తాను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశానని, ఇప్పుడు ఆ విషయాన్ని మదిలో ఉంచుకుని రూ.కోటి పరిహారం ప్రకటించామని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరిదని తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.