కరోనా కేసుల విషయంలో చైనా తప్పుడు లెక్కలు బట్టబయలయ్యాయి. చైనా చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఓ నివేదిక లీక్ అయినట్లు.. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫారిన్ పాలసీ మ్యాగజైన్ అండ్ 100 రిపోర్టర్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాలో ఇప్పటివరకు 6లక్షల 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయన్నది ఆ నివేదిక సారాంశం. చైనా దేశ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ లు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ లో నమోదైన కేసులన్నిటినీ పరిశీలించామని, అలాగే మొత్తం 230 నగరాల్లో నమోదైన రికార్డులను పరిశీలించామని ఆ నివేదిక పేర్కొంది.
అయితే, ప్రస్తుతం చైనా చెబుతున్న లెక్కల ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో, అమెరికా సహా పలు దేశాలు కరోనా కేసులపై చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తప్పుడు లెక్కలను బహిర్గతం చేస్తూ నివేదిక లీక్ కావడం సంచలనం కలిగిస్తోంది. చైనా నిజంగానే తప్పుడు లెక్కలు చెబుతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.