English | Telugu

ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటి రూపాయ‌ల‌ ఎక్స్‌గ్రేషియా: సి.ఎం. జ‌గ‌న్‌

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పరామర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటా. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు ఇస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. అందరూ కోలుకునే వరకు ఉచిత వైద్యం అందించ‌నున్నారు. విశాఖ ఘటన బాధాకరమని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తున్న‌ట్లు సి.ఎం. ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేస్తారని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ మోగాలని, కానీ అలా జరగలేదని సి.ఎం. జగన్‌ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, అపస్మారక స్థితిలో ఉన్న వారు కోలుకుంటున్నారని ముఖ్య‌మంత్రి జగన్‌ తెలిపారు.