English | Telugu

టీవీ5 కార్యాలయంపై దాడి ఓ దుష్టచర్య: ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌

హైదరాబాదులోని టీవీ5 చానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని దర్యాప్తు అధికారులను కోరారు.

ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు.

ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే కుట్రలో భాగమేనని, మీడియా సంస్థలను, జర్నలిస్టులను టార్గెట్ చేసి జరుపుతున్న ఇలాంటి దాడులను ప్రజలు ప్రజాతంత్రవాదులు ఖండించాల‌ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.