English | Telugu

అత్యవసర సరుకుల్లో మద్యం! మోదీస‌ర్కార్ నిబంధ‌న‌ల స‌డ‌లింపు!

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూనే మరో వైపు మద్యం అమ్మకాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనువెంటనే మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపేశాయి. ఏమైతేనేం! అత్యవసర సరుకుల్లో మద్యాన్ని చేర్చి మరీ అందుబాటులోకి తీసుకురావడం అత్యంత బాధాకరం.

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అందక మానేసిన వారు దాదాపు సాధారణ సమాజ సభ్యులుగా మారిపోయారు. వారిలో 75 శాతం మద్యపాన ప్రియులు ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. పైగా మద్యపానం సేవించే వారిలో సాధారణంగానే వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. ఇది కరోనా వ్యాప్తి చెందేందుకే దారి తీస్తుంది తప్ప నిరోధించేందుకు ఏ మాత్రమూ ఉపయోగపడదు.

ఉపాధి కోల్పోయి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ఈ లాక్‌డౌన్‌ సమయంలో మద్యానికి సరిపడా నగదు అందుబాటులో లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

పోలీసు స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన రోడ్డు ప్రమాదాల కేసుల్లో 75 శాతం మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల జరిగినవే. సాధార‌ణంగా 20 నుంచి 25 శాతం మద్యపాన సంబంధిత మరణాలే వుంటాయి. సమాజంలో సగం కుటుంబాలు మద్యపానంతో చితికి పోతున్నవే.

2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.2.5 లక్షల కోట్లు. అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. అయితే మద్యపానం ద్వారా సంభవించిన లివర్‌ క్యాన్సర్‌, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబెసిటీ, చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రయివేటు కార్పొరేట్‌ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను, ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.40,000 కోట్లు.